భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. 752 చెల్లుబాటు కాగా, 15 చెల్లలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం (సెప్టెంబర్ 9) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్ లో ఓటింగ్ జరిగింది. మొత్తం 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ, రాజ్యసభతో సహా భారత పార్లమెంటులో మొత్తం 788 ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా, మొత్తం 781 ఎంపీలు ఓటు వేయాల్సి వచ్చింది. అందులో 13 మంది ఓటింగ్ లో పాల్గొనలేదు. వారిలో, బీఆర్ఎస్ నుండి నలుగురు, బీజేడీ నుండి ఏడు మంది, అకాలీదళ్ నుండి ఒకరు, ఒక స్వతంత్ర ఎంపీ ఓటు వేయలేదు. ఎన్డీఏ నుండి 427 మంది ఎంపీలు ఓటు వేశారు. రాజ్యసభ జనరల్ సెక్రటరీ పిసి మోదీ ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు.
ఆరోగ్య కారణాల వల్ల జగదీప్ ధంఖర్ తన పదవికి రాజీనామా చేయడంతో జూలై 21, 2025 నుండి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. జగదీప్ ధన్‌కడ్ రాజీనామా తరువాత బీజేపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించారు.
సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. అక్టోబర్ 20 , 1957లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. 1985 నవంబర్ 25న, రాధాకృష్ణన్ ఆర్. సుమతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. జూలై 31, 2025 వరకు మహారాష్ట్ర 24వ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు వరకు. దీనికి ముందు, ఆయన ఫిబ్రవరి 2023 నుండి జూలై 2024 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. మార్చి-జూలై 2024 మధ్య, ఆయన తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. రాధాకృష్ణన్ గతంలో జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. కోయంబత్తూరు నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు రాధాకృష్ణన్.
తూత్తుకుడిలోని చిదంబరం కాలేజ్ నుంచి బీబీఏ డిగ్రీని పొందారు. 16 సంవత్సరాల వయస్సు లోనే రాధాకృష్ణన్ RSSతో పాటు భారతీయ జనసంఘ్ లాంటి సంస్థలతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. రాధాకృష్ణన్ 1974లో భారతీయ జనతా పార్టీ పూర్వీకులైన భారతీయ జనసంఘ్ రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యాడు. జనసంఘ్‌లో చేరడానికి ముందు, ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరాడు. 1996లో, రాధాకృష్ణన్ తమిళనాడులోని బీజేపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1998లో కోయంబత్తూర్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు.
తన ఎంపీ పదవీకాలంలో, ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రభుత్వ రంగ సంస్థల కోసం పార్లమెంటరీ కమిటీ (PSUలు), ఆర్థికంపై సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. రాధాకృష్ణన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కుంభకోణాన్ని దర్యాప్తు చేసే పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలో కూడా సభ్యుడుగా ఉన్నారు. 2004 నుండి 2007 వరకు, రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజుల పాటు కొనసాగిన ఆయన, 19 వేల కిలోమీటర్ల ‘రథయాత్ర’కు కూడా నాయకత్వం వహించారు. జనంలో ఒక్కడిగా కోయంబత్తూరు వాజ్‌పాయిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2004లో AIADMKతో బీజేపీ పొత్తులో ఆయన కీలక పాత్ర పోషించారు.
రాధాకృష్ణన్ 2016 నుండి 2020 వరకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని కొచ్చిలోని కాయిర్ బోర్డుకు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. ఆయన పదవీకాలంలో, భారతదేశం నుండి కాయిర్ ఎగుమతులు ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 2,532 కోట్లకు చేరుకున్నాయి. 2020 నుండి 2022 వరకు ఆయన బీజేపీ కేరళకు అఖిల భారత ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు.