Nepal Gen-Z Protest: నేపాల్లో యువత నిరసనలు కొనసాగిస్తోంది. తాజాగా వారి నుంచి మరిన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలని, దేశంలో 30 ఏళ్ల దోపిడీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తించి, పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దేశ భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమమని చెబుతున్నారు. కొత్త రాజకీయ వ్యవస్థ వస్తేనే శాంతి స్థాపన జరుగుతుందని నిరసనకారులు అంటున్నారు.
పాల్లో జెన్ జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. కర్ఫ్యూ ప్రకటించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేఫథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగిరాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న భారత్.. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్కసారిగా పెల్లుబికిన ఆందోళనల తీవ్రతకు కేపీ శర్మ ఓలీ.. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్మీ బాధ్యతలు తీసుకుంది.