Varun tej – Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, తన “విశ్వంభర” సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలను పరామర్శించి, శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంబంలో కొత్త సభ్యుడు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
గత మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. “జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను” అంటూ ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వచ్చిన “మిస్టర్” సినిమా సమయంలో వీరు తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ స్నేహితులుగా మారారు. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు వీరి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.